ఢిల్లీలో పర్యావరణహిత దీపావళి

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 21 Oct 2019 2:12 PM IST

ఢిల్లీలో పర్యావరణహిత దీపావళి

కాలుష్యం నివారణ చర్యల్లో భాగంగా ఈ దీపావళికీ కూడా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో హరిత టపాసులే కాల్చాలని మరోసారి సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. వీటిని కొనేవాళ్లే కాదు.. అమ్మిన వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతోంది. 2018లో దీపావళి ముందు సుప్రీంకోర్టు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లలో నాన్ గ్రీన్ టపాసుల అమ్మకాలు, వినియోగం పై నిషేధం విధించింది. దీపావళి దగ్గరపడుతున్న నేపథ్యంలో దీన్ని ఉల్లంఘిస్తూ టపాసులు కాల్చిన, విక్రయించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని మరోసారి హెచ్చరించింది. దోషులుగా తేలితే ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంది.

Dipavali

శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా మండలి ఈ హరిత టపాసుల ఫార్ములాను తయారుచేసింది. ఇవి చూడటానికి చాలా మామూలుగానే ఉంటాయి. మిగతా అన్ని టపాసులలాగే పేలుతాయి. కానీ వీటివల్ల వచ్చే శబ్దం, పొగ చాలా తక్కువగా ఉంటాయి. దాంతో కాలుష్యం చాలా వరకు తగ్గిపోతుంది. సాధారణ క్రాకర్స్ ఎక్కువ నైట్రోజన్, సల్ఫర్ వాయువులను విడుదల చేస్తాయి. వీటితో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ 50 శాతం నుంచి 80 శాతం వరకు తక్కువ విడుదల చేయటం వల్ల కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Dipavali (2)

వీటిలో చిచ్చుబుడ్లు, కాకరపూవొత్తులు, భూచక్రాలు, లక్ష్మీ బాంబులు, పెన్సిళ్లు అందుబాటులో ఉన్నాయి. హరిత టపాసులను కూడా రకరకాల పదార్థాలను ఉపయోగించి కొత్త కొత్త వెరైటీలుగా తయారు చేస్తున్నారు. నీటిని విడుదల చేసే టపాసులు కొన్నయితే, మంచి ఆరోమా విడుదల చేసే టపాసులు ఇంకొన్ని. ఇంతే కాక తక్కువ సల్ఫర్, తక్కువ నైట్రోజన్ విడుదలచేసే క్రాకర్స్, తక్కువ అల్యూమినియంతో తయారుచేసిన క్రాకర్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ పర్యావరణహిత టపాసులను ఎలా గుర్తు పట్టాలో తెలుసా?.. ఈ పెట్టెలు పై ఒక ఆకుపచ్చ రంగు లోగోతో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది. 230 సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి.

Next Story