తెలంగాణలో ఎంట్రెన్స్ పరీక్షల తేదీలు ఖరారు.. ఇంటర్‌ క్లాసులు ఎప్పుడంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2020 3:00 PM GMT
తెలంగాణలో ఎంట్రెన్స్ పరీక్షల తేదీలు ఖరారు.. ఇంటర్‌ క్లాసులు ఎప్పుడంటే..?

తెలంగాణలో ఈ నెల 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ప్రవేశ పరీక్షలు, విద్యా సంవత్సరంపై కీలకంగా సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 31న ఈసెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహించనున్నట్ల తెలిపారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలను సెప్టెంబర్‌ 9,10,11,14 తేదీల్లో నిర్వహించనున్నామన్నారు. అయితే.. కోర్టు అనుమతితో ఈ తేదీలను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించనుందని తెలిపారు. ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. ఇక 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ 1 తర్వాత ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని, 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు.

రాష్ట్రంలో ప‍్రవేశ పరీక్షలు, ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని ప్రభుత్వం ఈ సందర్భంగా న్యాయస్థానంకు తెలిపింది. ఇక ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Next Story