వాల్తేరు వీరయ్య.. ట్రైల‌ర్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

Waltair Veerayya pre release and trailer dates fixed.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌ చిత్రం 'వాల్తేరు వీర‌య్య‌'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2023 10:09 AM IST
వాల్తేరు వీరయ్య.. ట్రైల‌ర్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌ చిత్రం 'వాల్తేరు వీర‌య్య‌'. బాబీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని బావించింది. విశాఖ‌లోని ఆర్‌కేబీచ్‌లో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసుకుంది.

అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ ఈవెంట్‌కు బ్రేక్ ప‌డింది. అయితే.. ఇప్పుడు వేదిక‌ను మార్చ‌డంతో పాటు ఎప్పుడు నిర్వ‌హించ‌నున్నారు అన్న విష‌యాన్ని చెప్పేశారు. జనవరి 8న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో వాల్తేరు వీర‌య్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ ఈవెంట్‌కు ఒక రోజు ముందే అంటే జ‌న‌వ‌రి 7న ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన బాస్ పార్టీ, పూనకాలు లోడింగ్ పాటలు యూట్యూబ్‌లో దూసుకుపోతుండ‌డంతో పాటు చిత్రంపై అంచ‌నాలు పెంచేశాయి.

ఇదిలా ఉంటే.. చాలా కాలం త‌రువాత మెగా, నంద‌మూరి హీరోలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీప‌డ‌బోతున్నారు. చిరంజీవి న‌టించిన 'వాల్తేరు వీరయ్య‌'తో పాటు బాల‌కృష్ణ న‌టించిన'వీర సింహారెడ్డి' చిత్రాలు సంక్రాంతికి ఒక రోజు గ్యాప్‌లో విడుద‌ల కానున్నాయి. కాగా.. ఈ రెండు చిత్రాల‌ను మైత్రీ మూవీస్ మేక‌ర్స్ నిర్మించ‌డం విశేషం.

Next Story