సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు మిహిర్‌ దాస్ క‌న్నుమూత‌

Veteran Odia actor Mihir Das passes away at 63.క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2022 9:34 AM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు మిహిర్‌ దాస్ క‌న్నుమూత‌

క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక‌రి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌ముందే మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవ‌ల టాలీవుడ్ న‌టుడు, నిర్మాత, సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మ‌హేష్‌బాబు అన్న‌య్య ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్‌బాబు మ‌ర‌ణాన్ని మ‌రిచిపోక‌ముందే తాజాగా ఒడిశా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన సీనియ‌ర్ న‌టుడు మిహిర్ కుమార్ దాస్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 63 సంవ‌త్స‌రాలు.

మిహిర్ కుమార్ దాస్ గ‌త కొంత‌కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో డ‌యాసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఆయ‌న గుండెపోటుకు గురైయ్యారు. దీంతో ఆయ‌న్ను కుటుంబ స‌భ్యులు కటక్ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. బహుళ అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

మిహిర్ కుమార్ దాస్ మృతి ప‌ట్ల చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మిహిర్ దాస్ మరణం తీరని విషాదం, ఒడిశా చిత్ర పరిశ్రమకు పూడ్చలేని లోటు అంటూ సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు.

ప్రధాని మోడీ సైతం మిహిర్ దాస్ మరణంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుండి సందేశం విడుదల చేశారు. మిహిర్ దాస్ మరణవార్త కలచివేసింది. ఏళ్ల తరబడిన సాగిన ఆయన నటప్రస్థానంలో అనేక మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపం అంటూ ప్ర‌ధాని ట్వీట్ చేశారు.

మయూర్‌భంజ్‌ జిల్లాలోని బరిపదలో 1959 ఫిబ్రవరి 11వ తేదీన మిహిర్‌ దాస్‌ జన్మించారు. 1979లో విడుదలైన మధుర విజయ్‌ సూపర్‌ హిట్‌ కావడంతో ఆయన దశ తిరిగింది. నాలుగు ద‌శాబ్ధాల కెరీర్‌లో 150పైగా చిత్రాల్లో న‌టించారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు చేశారు. లక్ష్మీ ప్రతిమ, ఫెరి ఆ మో సున్నా భొవుణి చిత్రాల్లో ఆయ‌న అద్భుత న‌ట‌న‌కు గానూ రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డులు ల‌భించాయి. మిహిర్ దాస్ ప్రముఖ సింగర్ చిత్త జేన కూతురు సంగీతను వివాహం చేసుకున్నారు. సంగీత దాస్ 2010లో మరణించారు. వీరికి అమలన్ దాస్ కుమారుడు. ఈయన ఓలివుడ్ లో హీరోగా కొనసాగుతున్నారు.

Next Story
Share it