సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు. నటులు గోవిందా, పద్మిని కొల్హాపురి, అశోక్ పండిట్ తదితరులు ఆయనకు నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో ఇస్మాయిల్ జన్మించారు. తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సౌండ్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. బాలీవుడ్ దర్శకుడు భీమ్ సింగ్ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశారు. ' ఆగర్' చిత్రంతో దర్శకుడిగా మారారు. 'అహిస్తా అహిస్తా', 'జిద్', 'అగర్', 'గాడ్ అండ్ గన్', 'పోలీస్ పబ్లిక్', 'మజ్దూర్', 'దిల్ ఆఖిర్ దిల్ హై', 'బులుండి', 'నిశ్చయ్', 'సూర్య', 'ఝూతా సచ్' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా 'తోడా తుమ్ బద్‌లో తోడా హమ్'. 2004లో ఈ చిత్రం విడుదలైంది.