బాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత
బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ సినీ నిర్మాత దివంగత వి శాంతారామ్ భార్య, నటి సంధ్యా శాంతారామ్ శనివారం..
By - అంజి |
బాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత
బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ సినీ నిర్మాత దివంగత వి శాంతారామ్ భార్య, నటి సంధ్యా శాంతారామ్ శనివారం ముంబైలో కన్నుమూశారు. ఆమె వయసు 87. వృద్ధాప్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచినట్టు సినీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 13, 1938న కొచ్చిలో జన్మించిన ఆమెకు 1951లో వి. శాంతారామ్ దర్శకత్వంలో అమర్ భూపాలి అనే సినిమాలో మొదటిసారి పాత్ర లభించింది. ఆమె 1956లో వి. శాంతారామ్‌ను వివాహం చేసుకుంది. తన చక్కదనం, వ్యక్తీకరణ నృత్యం, శక్తివంతమైన ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన సంధ్య, 1950లు మరియు 60ల నాటి కాలాతీత క్లాసిక్‌ల ద్వారా ఇంటింటికి సుపరిచితమైన పేరుగా మారింది.
'అమర్ భూపాలి' అనే మరాఠీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె 'జనక్ జనక్ పాయల్ బాజే', స్త్రీ, పింజారా, నవరంగ్ వంటి హిందీ, మరాఠీ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 'పర్చైన్', 'తీన్ బత్తి చార్ రాస్తా', దో ఆంఖేన్ బరాహ్ హాత్', 'చందనాచి చోలీ అంగ్ అంగ్ జలీ', 'సెహ్రా అంగారా', 'లడ్రి జ్యాల్‌ద్రీ కి'కి సహ్యాల్‌ద్రీ కి' చిత్రాల్లోనూ నటించారు. ఆమె భర్త శాంతారామ్ లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా పేరొందారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. కాగా ఇండియా టుడే నివేదిక ప్రకారం, శివాజీ పార్క్ శ్మశానవాటికలో జరిగిన సంధ్యా శాంతారామ్ అంత్యక్రియలకు ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు హాజరయ్యారు.