సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అరుణ్ బాలి కన్నుమూశారు. గత కొంత కాలంగా మస్తీనియా గ్రావిస్ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. అరుణ్ బాలి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో 1942లో అరుణ్ బాలి జన్మించారు. 1989లో 'దూస్రా కేవాల్'తో బుల్లితెరపై తెరగ్రేటం చేశాడు. అనంతరం బుల్లితెరపై నటిస్తూనే వెండితెరపై కూడా నటించి మెప్పించారు. '3 ఇడియట్స్' (2009), 'పీకే' (2014), 'ఎయిర్‌లిఫ్ట్ '(2016), 'కేదార్‌నాథ్' (2018), 'పానిపట్' (2019), 'లాల్‌సింగ్ చద్దా'(2022) వంటి చిత్రాలలో బాలి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
అరుణ్ బాలి చివరిసారిగా శుక్రవారం విడుదలైన 'గుడ్‌బై' చిత్రంలో కనిపించారు. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న, నీనా గుప్తా, సునీల్ గ్రోవర్, పావైల్ గులాటి, ఆశిష్ విద్యార్థి, ఎల్లి అవ్రామ్, సాహిల్ మెహతా, శివిన్ నారంగ్ మరియు అభిషేక్ ఖాన్ కూడా నటించారు. కుటుంబ సభ్యుల మరణం చుట్టూ సినిమా తిరుగుతుంది.