ఆసక్తి రేపుతోన్న 'సైంధవ్' టీజర్.. అదిరేలా యాక్షన్ సీన్స్
వెంకటేష్ సైంధవ్ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్‌తో ఈ టీజర్ ఆసక్తిని పెంచుతోంది.
By అంజి Published on 16 Oct 2023 12:55 PM ISTఆసక్తి రేపుతోన్న 'సైంధవ్' టీజర్.. అదిరేలా యాక్షన్ సీన్స్
'హిట్' సినిమాతో బాక్సాఫీస్ సంచలనాలను సృష్టించిన తర్వాత, దర్శకుడు శైలేష్ కొలను.. ఫ్యామిలీ హీరో వెంకటేష్ 75వ చిత్రం 'సైంధవ్' డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్‌ని వదిలారు. ఈ టీజర్‌లో గత సినిమాలకు భిన్నంగా యాక్షన్ రోల్‌లో వెంకటేష్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్‌తో ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఫ్యామిలీ సీన్‌తో టీజర్ ప్రారంభమైంది. చంద్రప్రస్థ అనే సిటీలో తన భార్య, కూతురితో కలిసి వెంకటేష్ సంతోషంగా జీవిస్తున్నట్లు టీజర్ లో చూపించారు. ఇక నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీతో టీజర్ ఒక్కసారిగా యాక్షన్ మోడ్‌లోకి టర్న్ అయ్యింది.
కరుడుగుట్టిన క్రిమినల్ వికాస్‌గా నవాజుద్ధీన్ సిద్ధిఖీని చూపించారు. తనకు ఎదురొచ్చిన వారిని చంపేసే వాడిగా నవాజుద్ధీన్ సిద్ధిఖీ కనిపించాడు. సైకోగా వెంకటేష్ ఎంట్రీ టీజర్‌లో రోమాలు నిక్కబొడిచేలా చేస్తోంది. ఓ సారి కత్తి, మరోసారి గన్ పడుతూ శత్రు సంహారం చేసినట్లుగా వెంకీని పవర్‌ఫుల్‌గా టీజర్‌లో ఆవిష్కరించారు. చిన్న పిల్లలకు గన్ ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌కు సప్లై చేసే గ్యాంగ్‌ను ఎదురించే వ్యక్తిగా ఈ సినిమాలో వెంకటేష్ కనిపిస్తోన్నట్లుగా టీజర్ చూస్తే తెలుస్తోంది. టీజర్ చివరలో వెంకటేష్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. టీజర్‌లో టెర్రరిజం, డ్రగ్స్ వంటి అంశాలను చర్చించారు.
దర్శకుడు శైలేష్ కొలను వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీలను ఇద్దరు శక్తివంతమైన, కనికరం లేని వ్యక్తులుగా చూపించారు. నవాజుద్దీన్ క్లాస్‌గా కనిపించాడు. ఎస్ మణికందన్, సంతోష్ నారాయణన్ విజువల్స్, సౌండ్ స్టోరీ-టెల్లింగ్‌ని అందంగా తీర్చిదిద్దడంలో చేయి చేయి కలిపి పనిచేశారు. సైంధవ్ సినిమాతో బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధికీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధాశ్రీనాథ్, ఆండ్రియా, రుహాణి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.