నేటి నుండి అమెజాన్ ప్రైమ్‌లో 'వ‌కీల్ సాబ్'

Vakeel Saab streaming on amazon prime from today. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ‌కీల్ సాబ్ ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2021 10:43 AM IST
Vakeel saab on amazon prime today

మూడేళ్ల గ్యాప్ త‌రువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వ‌కీల్ సాబ్ ' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదలై చక్కటి ఆదరణ పొందింది. 85 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చి ప‌వ‌న్ కెరీర్‌లో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా నిలిచింది. గ‌తంలో 'అత్తారింటికి దారేది' చిత్రం 82 కోట్లు వ‌సూలు చేస్తే.. ఇప్పుడు 'వ‌కీల్ సాబ్ ' ఆ రికార్డు బ్రేక్ చేసింది. ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 'వకీల్ సాబ్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు అమెజాన్ ప్రైమ్ ముందుగా 14 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే తాజాగా అమెజాన్ సంస్థ దిల్ రాజుకు మరో 12 కోట్లు అదనంగా చెల్లించినట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తరువాత యాభై రోజుల వరకూ ఏ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవ్వకూడదు అన్నది నిబంధన. అయితే అమెజాన్ వారు మాత్రం 'వకీల్ సాబ్'ను 50 రోజుల కన్నా ముందే స్ట్రీమింగ్ చేసేందుకు దిల్ రాజు తో ఒప్పందం కుదుర్చుకున్నారట. అందుకు గానూ దిల్ రాజు 12 కోట్లు అదనంగా డిమాండ్ చేశారట. అంటే ఇంతకుముందు రైట్స్ కు 14 కోట్లు.. ఇప్పుడు 21 రోజుల్లోనే స్ట్రీమింగ్ చేసేందుకు గానూ అదనంగా 12 కోట్లు చెల్లించిందట అమెజాన్. మొత్తం కలిపి 26 కోట్లు అన్నమాట.

తొలి వారం వ‌కీల్ సాబ్ థియేటర్స్ అన్ని హౌజ్ ఫుల్ కాగా, రెండో వారానికి ప‌రిస్థితులు అన్ని తారుమారు అయ్యాయి. క‌రోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేప‌థ్యంలో జ‌నాలు థియేట‌ర్స్‌కు రావ‌డమే మానేశారు. దీంతో చేసేది ఏమీ లేక 21 రోజుల్లోనే సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసుకోవడానికి దిల్ రాజు అంగీకరించారట.


Next Story