అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. టాలీవుడ్‌లోనే తొలి హీరోగా రికార్డ్‌

UAE Government Gave Allu Arjun A Golden Visa. 'పుష్ప' సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు

By అంజి  Published on  20 Jan 2023 4:19 PM IST
అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. టాలీవుడ్‌లోనే తొలి హీరోగా రికార్డ్‌

'పుష్ప' సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అల్లు అర్జున్‌ గౌరవార్థం దుబాయ్ ప్రభుత్వం.. ఆయన గోల్డెన్ వీసా ఇచ్చింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు. దీంతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ''ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు దుబాయ్‌కు థ్యాంక్స్‌. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్స్. త్వరలో మళ్ళీ కలుద్దాం'' అంటూ అల్లు అర్జున్‌ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.

గోల్డెన్ వీసాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక నిర్దిష్ట రంగంలో రాణిస్తున్న వారిని గౌరవించటానికి ప్రవేశపెట్టింది. భారతదేశంలోని చాలా మంది ప్రముఖ క్రీడాకారులు, నటులు, నటీమణులకు ఈ గోల్డెన్ వీసా మంజూరు చేయబడింది. గోల్డెన్ వీసా అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పదేళ్ల వరకు ఉండేందుకు అనుమతించే ప్రత్యేక వీసా. దీన్ని కలిగి ఉన్న విదేశీ పౌరులు యూఏఈ పౌరులుగా పరిగణించబడతారు. ప్రతి పదేళ్లకు ఒకసారి ఈ గోల్డెన్ వీసాను రెన్యూవల్ చేసుకుంటే సరిపోతుంది. సైన్స్, సినిమా, క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభావంతులైన, పేరు పొందిన వ్యక్తులకు మాత్రమే ఈ గోల్డెన్ వీసా ఇస్తారు.

ఈ వీసాను మొదటిసారి బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ అందుకున్నాడు. ఆ తర్వాత సంజయ్‌ దత్‌, సానియా మీర్జా, కమల్‌ హాసన్‌, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, సోనూసూద్‌, మౌనీ రాయ్‌, బోనీ కపూర్‌, సంజయ్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, ఊర్వశి రౌతేలా, సునీల్‌ శెట్టి, నేహా కక్కర్‌, ఫరాఖాన్‌, రణవీర్‌ సింగ్‌, రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన, విక్రమ్‌, త్రిష, కాజల్‌ అగర్వాల్‌, దుల్కర్‌ సల్మాన్‌, మీన, విజయ్‌ సేతుపతి తదితర నటులు ఈ వీసాను పొందారు. తాజాగా ఈ జాబితాలోకి అల్లు అర్జున్ వచ్చి చేరారు. టాలీవుడ్‌లో గోల్డెన్ వీసా అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్‌ రికార్డు సృష్టించారు.


Next Story