భీమ్లా నాయక్ సక్సెస్ మీట్.. ఫలానా వాళ్లతోనే పని చేయాలని ఎప్పుడూ అనుకోలేదు
Trivikram's big statement at Bheemla Nayak success meet.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2022 4:20 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. త్రివిక్రమ్ మాటలు అందించగా.. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం 'భీమ్లా నాయక్ సక్సెస్ ప్రెస్‌మీట్'ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్, సాగర్ చంద్ర, సంయుక్త మీనన్, తమన్, గణేష్ మాస్టర్, నాగవంశీ, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు సాగర్ కె.చంద్ర మాట్లాడుతూ.. సినిమా పెద్ద విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా థమన్ కు ధన్యవాదాలు. ఈ చిత్రానికి అతనొక మెయిన్ సోల్ అని తెలిపారు. ఇక ఈ ప్రాజెక్ట్ బ్యాక్‌బోన్ త్రివిక్రమ్ అని చెప్పుకొచ్చారు. ఒక పవ్వుల దండలో మేమంతా పువ్వులమైతే మమ్మల్ని కలిపిన దారం త్రివిక్రమ్ అని అన్నారు. తొలి రోజు ఆయన్ని కలిసినప్పుడు నిడివి గురించి మాట్లాడుకున్నట్లు చెప్పారు. ఆయనతో కలిసి పని చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.
సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు పిల్లర్ అని అంటున్నారు. పిల్లర్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే సిమెంట్ అవసరం అని.. ఆ సిమెంట్ త్రివిక్రమ్ అని అన్నారు. ఆయన మాకు గట్టి సపోర్ట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని మ్యూజిక్‌ను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళం వాళ్ళు సినిమాలో అసలు సాంగ్ ఎలా చేస్తున్నారు ? అని అడిగారు. వాళ్లకు ఈ సినిమా పెద్ద ఆన్సర్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ కథని సాగర్ ఎంతగానో అర్థం చేసుకుని చాలా అద్భుతంగా తెరకెక్కించాడని కొనియాడారు. తామంతా ఆయన వెంటనే ఉన్నట్లు చెప్పారు. ఆయనకు వచ్చిన ఐడియా ప్రకారమే మొగిలయ్యతో పాట పాడించాం. ఆ తరువాత ఆయనకు పద్మశ్రీ రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఫలానా వాళ్లతోనే పని చేయాలని ఎప్పుడూ అనుకోలేదని.. పరిస్థితులు అలా కుదిరాయన్నారు. ఎంతో మంది కళాకారులు ఈ చిత్రంలో భాగమయ్యారు. కరోనా సమయంలో కూడా పవన్, రానా ఎలాంటి భయాలు లేకుండా ప్రజల మధ్య పనిచేశారు. ఇక థమన్ నా కుటుంబసభ్యుడిగా పనిచేస్తాడు. కథ చెప్పిన వెంటనే పాటలిచ్చేస్తాడు. అతడు ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు అని త్రివిక్రమ్ అన్నారు.