టాలీవుడ్‌ సింగర్ మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం

టాలీవుడ్‌ సింగర్‌ మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.

By Srikanth Gundamalla  Published on  18 March 2024 10:34 AM IST
tollywood, singer mangli, car, accident ,

టాలీవుడ్‌ సింగర్ మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం 

టాలీవుడ్‌ సింగర్‌ మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ రోడ్డు ప్రమాదం మార్చి 16 శనివారం రాత్రి జరగ్గా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌-బెంగళూరు రహదారిపై వెళ్తుండగా ఓ డీసీఎం వచ్చి ఢీకొట్టింది. ఆ డీసీఎం కర్ణాటకకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి సింగర్ మంగ్లీ హాజరు అయ్యింది. ఆ తర్వాత అక్కడ కార్యక్రమం పూర్తయ్యింది. శనివరాం రాత్రి హైదరాబాద్ -బెంగళూరు హైవే మీద నుంచి ఇంటికి తిరుగు పయనం అయ్యారు. ఈ క్రమంలోనే శంషాబాద్‌ మండలంలోని తొండుపల్లి వంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడే కర్ణాటకకు చెందిన ఒక డీసీఎం వేగంగా వచ్చి మంగ్లీ కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీ కారు స్వల్పంగా ధ్వంసం అయ్యింది.

కాగా.. డీసీఎం డ్రైవర్‌ మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్‌ పోలీసులు చెబుతున్నారు. ఇక ప్రమాద సమయంలో కారులో మంగ్లీతో పాటు డ్రైవర్‌ మేగరాజు, మనోహర్‌ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. కారు మాత్రమే స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు చెప్పారు. ఇక ఈ ప్రమాదం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మంగ్లీ అదే కారులో ఇంటికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. శనివారం ఈ ప్రమాదం జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది.

Next Story