టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
1948 మార్చి 8న నెల్లూరు జిల్లా గూడూరులో ఎం.రామకృష్ణారెడ్డి జన్మించారు. మైసూరు విశ్వవిద్యాలయంలో బి.ఇ పూర్తి చేశారు. కొంతకాలం సిమెంటు రేకుల వ్యాపారం నిర్వహించారు. అనంతరం తన బంధువైన ఎం.ఎస్.రెడ్డి ప్రోత్సాహంతో 'అభిమానవంతులు' సినిమాతో నిర్మాతగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.ఈ చిత్రంతోనే ఫటాఫట్ జయలక్ష్మి, శోభానాయుడులను ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ తరువాత 'వైంకుఠపాళి', 'అల్లుడుగారు జిందాబాద్', 'మూడిళ్ల ముచ్చట', 'మాయగాడు','గడుసు పిల్లోడు', 'మా ఊరి దేవత', 'సీతాపతి సంసారం', 'అగ్ని కెరాటాలు ' వంటి చిత్రాలను నిర్మించారు. రామకృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.