టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత
Tollywood Director Tatineni Ramarao Passed Away.సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న(ఏప్రిల్ 19న)
By తోట వంశీ కుమార్ Published on 20 April 2022 2:38 AM GMTసినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న(ఏప్రిల్ 19న) సీనియర్ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూసిన విషయాన్ని జీర్ణించుకోలేకముందే మరో సీనియర్ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. అలనాటి ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు నేడు(బుధవారం) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
తాతినేని రామారావు.. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో 1938 నవంబర్ 10న జన్మించారు. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు ఆయనకు సమీప బంధువు కావడంతో సినిమాలపై ఆసక్తి పెరగడంతో.. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. 1966లో 'నవరాత్రి' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఏఎన్నార్, జయలలిత ప్రధాన పాత్రల్లో తాతినేని దర్శకత్వంలో తెరకెక్కిన `బ్రహ్మచారి` చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో తాను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తరువాత 'మంచి మిత్రులు`, `రైతు కుటుంబం`, `జీవన తరంగాలు`, `యమగోల`, `శ్రీరామ రక్ష` వంటి చిత్రాలను తెరకెక్కించారు.
'లోక్ పర్లోక్' చిత్రంతో బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. తెలుగు, హిందీ బాషల్లో కలిపి దాదాపు 80కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన తెలుగు దర్శకుడిగా రామారావు గుర్తింపు పొందారు. యన్టీఆర్ తో తాతినేని రామారావుమూడు చిత్రాలు 'యమగోల', 'ఆటగాడు', 'అనురాగదేవత' తెరకెక్కించారు. 'అంధా కానూన్'తో రజినీకాంత్ ను బాలీవుడ్ కు పరిచయం చేశారు. కమల్ హాసన్ తో 'యే తో కమాల్ హోగయా', జితేంద్ర, మిథున్ చక్రవర్తితో పలు హిందీ సినిమాలు తెరకెక్కించారు. అమితాబ్ బచ్చన్ తో `అంధా కానూన్', 'ఇంక్విలాబ్` చిత్రాలను తీశారు. 2000లో గోవింద హీరోగా రూపొందిన 'బేటీ నంబర్ వన్' రామారావు చివరి చిత్రం.