చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూత
Tollywood director Madan passes away.ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 20 Nov 2022 3:53 AM GMTచిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకరి మరణాన్ని జీర్ణించుకోకముందే మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో విషాదంలో మునిగిన టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం మదన్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురి కాగా.. ఆయన్ను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 1.41 సమయంలో తుదిశ్వాస విడిచారు. మదన్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మదన్ స్వస్థలం చిత్తూరు జిల్లాలోని మదనపల్లి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చారు. అసిస్టెంట్ కెమెరామెన్ గా ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర పనిచేశారు. కొన్ని చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించారు.
జగపతి బాబు, ప్రియమణి జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "పెళ్లయిన కొత్తలో" చిత్రంతో దర్శకుడిగా మారారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన "ఆ నలుగురు" చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి మంచి గుర్తింపు పొందారు. దర్శకుడిగా 'గుండె ఝల్లుమంది', 'ప్రవరాఖ్యుడు', 'కాఫీ విత్ మై వైఫ్', 'గరం',' గాయత్రి' వంటి చిత్రాలను తెరకెక్కించారు.