టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన కుటుంబానికి 'లైగర్' సినిమా కొనుగోలుదారులు, పంపిణీదారుల నుండి బెదిరింపులు ఉన్నాయని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్ ఇతరులను ప్రేరేపించారని, తనకు పోలీసు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్‌లో దర్శకుడు 'లైగర్' కొనుగోలుదారులు, పంపిణీదారులు తమకు డబ్బు తిరిగి ఇవ్వకపోతే తన ఇంటి ముందు నిరసన తెలుపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లిగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టకపోవడంతో కొనుగోలుదారులు, పంపిణీదారులు భారీ నష్టాన్ని చవిచూశారు. లైగర్ సినిమా బోల్తా పడటంతో పూరి జగన్నాథ్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. పూరి జగన్నాథ్‌కు చెందిన పూరి కనెక్ట్స్ ఎల్ఎల్‌పి ఆధ్వర్యంలో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసి లైగర్ సినిమాను నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో కాకతీయ ఎగ్జిబిటర్స్ నిర్వాహకుడు వరంగల్ శ్రీనుతో ఏప్రిల్ 12వ తేదీన ఒప్పందం చేసుకున్నారు.
సినిమా ప్లాఫ్ కావటంతో ఎగ్జిబిటర్లు అంతా నేడు జూబ్లీహిల్స్లోని పూరీజగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. పెద్ద మొత్తంలో నష్టాలు రావడంతో తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని పూరి జగన్నాథ్‌ను డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేశారు. దీంతో పూరి నెల రోజుల గడువు కోరారు. అయితే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం పూరి ఆఫీస్ ఎదుట ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసుకున్న పూరి జగన్నాథ్.. తన పరువు తీయాలని చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వనని హెచ్చరించాడు. దీనికి సంబంధించిన ఆడియో కాల్ నెట్టింట వైరల్‌గా మారింది.