తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ కు మద్రాస్ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రానికి ‘యు–ఏ’ (UA) సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డును ఆదేశించిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అయితే ఈ అంశాన్ని తాజా విచారణ కోసం మళ్లీ సింగిల్ జడ్జికే పంపిస్తూ, పిటిషనర్‌కు తన పిటిషన్‌ను సవరించుకునే అవకాశం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “సింగిల్ జడ్జి ఈ కేసులో అంశాల సారంపై (మెరిట్స్‌పై) వెళ్లకూడదు. రిట్ కోర్టు ఇచ్చిన నిర్ణయం నిలవదు. అప్పీల్‌ను అనుమతిస్తూ, ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. రిట్ పిటిషనర్‌కు పిటిషన్‌ను సవరించుకునే అవకాశం ఇస్తున్నాం” అని డివిజన్ బెంచ్ పేర్కొంది. దీంతో ‘జన నాయగన్’ చిత్ర సెన్సార్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. తాజా విచారణలో సింగిల్ జడ్జి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.