కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో సినిమా థియేటర్లలో సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓటీటీలలో సినిమాలను రిలీజ్ చేస్తే బెస్ట్ అని అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా కొందరు నిర్మాతలు లాభానికే ఓటీటీలకు సినిమాలను అమ్ముకుంటూ ఉన్నారు. తాజాగా మరో కొత్త సినిమా ఆహా యాప్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే పలు సినిమాల ఓటీటీ హక్కులను సొంతం చేసుకుని దూసుకుని వెళ్తున్న ఆహా యాప్.. ఇప్పుడు అనసూయ కొత్త సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.
అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'థ్యాంక్ యు బ్రదర్' థియేట్రికల్ రిలీజ్ అవ్వడం లేదు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో మే 7న ఆహాలో రిలీజ్ చేస్తున్నారు. అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో రమేశ్ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనసూయ గర్భిణిగా నటిస్తోంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గర్భిణిగా ఉన్న మహిళ లిఫ్ట్ లో ఇరుక్కుపోతే జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.