సూపర్ స్టార్ మహేష్ బాబు-పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మాస్ కు ట్రీట్ అని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు లుక్, టైటిల్ ట్రాక్ ద్వారా మాస్ కు మరింత దగ్గరయ్యేలా సినిమాను ప్లాన్ చేస్తూ ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ అమెరికాలో పూర్తీ అయ్యింది. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నాడు.
ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలుంటాయని వెల్లడించాడు థమన్. ఇప్పటికే మూడు పాటలు రెడీ అయిపోయాయని, పాటలన్నీ మాస్ టచ్ తో ఎనర్జిటిక్ గా వుంటాయని అభిమానులకు హింట్ ఇచ్చేశాడు. ఇటీవల థమన్ సంగీతం అందించిన సినిమాలు మంచి హిట్ గా నిలిచాయి. క్రాక్, వకీల్ సాబ్ సినిమాల్లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మంచి పేరు వచ్చింది. ఇక సర్కారు వారి పాట సినిమాలో థమన్ మహేష్ బాబుకు ఏ రేంజి ఎలివేషన్ ఇస్తాడా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.
సర్కారు వారి పాట లో ఓ పాటను గోవాలో చిత్రీకరించాలనుకున్నారు. త్వరలో గోవా కు వెళ్లాలని అనుకుంది టీమ్. కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకుందని తెలిసింది. ఈ నెల 15న హైదరాబాద్‌లో షెడ్యూల్ ఆరంభించి, దాదాపు 25 రోజుల పాటు ఇక్కడే చిత్రీకరణ జరపాలనుకుంటున్నారని తెలిసింది. ఆ తర్వాత గోవా వెళతారట. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.