విషాదం.. అన్నమయ్య సినిమా నిర్మాత కన్నుమూత
Telugu Producer Doraswamy Raju passes away.టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, అన్నమయ్య సినిమా నిర్మాత కన్నుమూత.
By తోట వంశీ కుమార్ Published on 18 Jan 2021 4:15 AMటాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు వి.దొరస్వామి రాజు కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. గత కొద్ది రోజులుగా బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. నిర్మాతగా దాదాపు 500 చిత్రాలను తెరకెక్కించారు. డిస్ట్రిబ్యూటర్‌గా అయితే.. అనేక సినిమాలను సీడెడ్ ఏరియాల్లో విడుదల చేశారు. డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, గజదొంగ, కిరాయిదాదా, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, వంటి అద్భుత చిత్రాలను ఆయన నిర్మించారు.
1978లో రాయలసీమలో తిరుపతి పట్టణంలో 'విజయమల్లేశ్వరి కంబైన్స్' అంటే వి.ఎమ్.సి. పేరు మీద డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ప్రారంభించారు. తొలుత ఈ సంస్థ చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమై యన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన 'సింహబలుడు' చిత్రాన్ని విడుదల చేసింది. 1979లో యన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన 'డ్రైవర్ రాముడు' తో తమ వి.ఎమ్.సి. సంస్థ ను గుంతకల్ కేంద్రంగా రాయలసీమ అంతటా విస్తరించారు. ఆ తరువాత "వేటగాడు, యుగంధర్, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి" వంటి విజయవంతమైన చిత్రాలను తమ వి.ఎమ్.సి. ద్వారా రాయలసీమలో విడుదల చేసి మంచి పేరు గడించింది. అప్పటి నుంచీ దొరస్వామి రాజును అందరూ వీఎమ్‌సీ దొరస్వామి రాజు అని పిలిచేవారు. ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షునిగా రెండు సార్లు పనిచేశారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు మెంబర్‌గానూ ఉన్నారు. 1994లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు.