మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ ను చిక్కుల్లో పడేసిన పూనమ్.. MAA ఆయన విషయంలో స్పందిస్తుందా?
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తన ఫిర్యాదును పరిష్కరించాలని నటి పూనమ్ కౌర్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను కోరారు.
By అంజి Published on 18 Sep 2024 6:12 AM GMTమూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ ను చిక్కుల్లో పడేసిన పూనమ్.. MAA ఆయన విషయంలో స్పందిస్తుందా?
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తన ఫిర్యాదును పరిష్కరించాలని నటి పూనమ్ కౌర్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను కోరారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైన విషయం సంచలమైంది. దీనిపై ఓ వైపు చర్చ జరుగుతూ ఉండగానే.. ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తాను దాఖలు చేసిన ఫిర్యాదును పరిష్కరించాలని నటి పూనమ్ కౌర్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను కోరారు.
సోషల్ మీడియాలో స్పందించిన నటి పూనమ్ కౌర్ "Had maa association taken complaint on Trivikram Srinivas, I and many wouldn’t have had the political suffering. I was rather silently ignored, I had given a call and then complained to the heads, I want industry bigwigs to question Director Trivikram (sic)." అంటూ ట్వీట్ చేశారు పూనమ్ కౌర్. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అంటూ చెప్పుకొచ్చారు పూనమ్.
తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలలో పనిచేసిన పూనమ్ కౌర్ ఏ విషయం మీద ఫిర్యాదు చేసిందో, లేక త్రివిక్రమ్ పై ఎలాంటి ఆరోపణలను చేసిందో ప్రస్తావించలేదు. అయితే తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ని ఆమె ప్రశ్నించారు. పూనమ్ తన ఫిర్యాదు సమయంలో సినీ పరిశ్రమలోని అనేక మంది ప్రముఖులను సంప్రదించిందని, అయితే ఆమె ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని ఇండస్ట్రీ పెద్దలకు ఆమె పిలుపునిచ్చారు. జవాబుదారీతనం కోసం పూనమ్ బహిరంగంగా ప్రస్తావించినప్పటికీ, త్రివిక్రమ్ లేదా MAA ఈ ఆరోపణలపై స్పందించలేదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో టాప్ దర్శకులు. గుంటూరు కారం, అల వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు. కొన్నాళ్ల క్రితం కూడా పూనమ్ పాండే సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంచలన ఆరోపణలు చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ ను పదే పదే టార్గెట్ చేశారు. కానీ ఆమె ఎప్పుడూ ఆయన పేరు ప్రస్తావించలేదు కానీ తన ట్వీట్లలో “గురూజీ” అనే పదాన్ని ప్రస్తావించారు. టాలీవుడ్ గురించి బాగా టచ్ ఉన్న వ్యక్తులు, త్రివిక్రమ్ మాటలకు ఉన్న ఫ్యాన్స్ త్రివిక్రమ్ ను గురూజీ అని పిలుస్తూ ఉంటారు.
ఇక 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశారనే ఆరోపణలపై జానీ మాస్టర్‌ను కూడా పూనమ్ కౌర్ విమర్శించారు. “నిందితుడైన ‘షేక్ జానీ’ని ఇకపై మాస్టర్ అని పిలవకూడదు. ‘మాస్టర్’ అనే పదానికి మర్యాద ఇవ్వాలి” అని ఆమె తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ మహిళా కొరియోగ్రాఫర్‌కు ALIFA తెలంగాణ సంఘీభావం:
ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు జానీ పాల్పడ్డాడు.
చెన్నై, ముంబై, హైదరాబాద్‌లో అవుట్‌డోర్ షూట్‌లతో పాటు, తన నార్సింగి నివాసంలో కూడా తనపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు ఆరోపించింది. జానీ మాస్టర్‌పై IPC సెక్షన్‌లు 376 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. చట్టపరమైన చర్యలతో పాటు, తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ పోష్ చట్టం కింద అంతర్గత విచారణకు సిఫారసు చేశారు.
ప్రముఖ జనసేన పార్టీ కార్యకర్త, కొరియోగ్రాఫర్‌పై కేసు పెట్టిన టాలీవుడ్ యువ మహిళా కొరియోగ్రాఫర్‌కు ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయన్స్ (తెలంగాణ) సంఘీభావం తెలిపింది. ముఖ్యంగా TFI, టెలివిజన్ పరిశ్రమలు స్త్రీ ద్వేషపూరిత చిత్రణ, స్త్రీలపై లైంగిక దోపిడీకి సంబంధించి గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా టెలివిజన్ ఛానెల్స్ లో మహిళా వ్యతిరేక, మైనారిటీల వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కి నివేదికలు అందాయి. 2018లో శ్రీ రెడ్డి చేసిన నిరసన చాలా మంది ఆర్టిస్టులకు సంబంధించిన ‘కమిట్‌మెంట్ కాంట్రాక్ట్స్’ గురించి బయటకు వచ్చాయి. అయితే టాలీవుడ్ నుండి మద్దతు లేకపోవడంతో పోలీసు ఫిర్యాదులు నమోదు కాలేదు. లైంగిక వేధింపులు, లింగ వివక్షపై విచారణ కోసం 2019లో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరిపి పలు సిఫార్సులు చేసింది. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలుగులోకి రాగా, HLC నివేదికపై కూడా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై ఓ యువ మహిళా కొరియోగ్రాఫర్ పెట్టిన కేసు సంచలనంగా మారింది. బాధిత మహిళ చేసిన ఫిర్యాదు, ఇతర మహిళలు కూడా ఫిర్యాదు చేయాలనే ధైర్యం ఇవ్వగలగడమే కాకుండా, ఇతరులు అనుసరించడానికి మార్గం సుగమం చేయగల సాహసోపేతమైన చర్య అని ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయన్స్ పేర్కొంది.
జానీ మాస్టర్ ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, ఆలిండియా ఫెమినిస్ట్ అలయన్స్ ఆయనపై మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. "దురదృష్టవశాత్తూ.. తెలుగు సామాజిక, టెలివిజన్ మీడియాలోని విభాగాలు బాధితుల గోప్యతను బయటపెట్టకూడదనే విషయాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నాయి. మీడియా నిందితుడిపై, అతని ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. బాధితురాలిపై చేసిన దాడి, చిన్న వయస్సులోనే ఆమెపై చేసిన దారుణాల గురించి చర్చించాలి. ఇంకా ఇలాంటి బాధలు పడిన వారి గురించి కూడా చర్చించాలి. అవసరమైన మద్దతు, కొందరి స్త్రీ ద్వేషపూరిత ధీరణి లాంటివి కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం పరిశ్రమ పెద్దలకు కూడా ఉంది. సాధారణ దైనందిన జీవితాన్ని కొనసాగించడానికి ఒక వాతావరణాన్ని సృష్టించడం మీడియా ముందు ఉంది. బదులుగా.. తెలుగు సామాజిక, టెలివిజన్ మీడియా బాధితులను అవమానించడం, వేధించడం వంటి పనిలో మునిగిపోతున్నట్లు కనిపిస్తోంది" అని ALIFA పేర్కొంది.