తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పించింది. 16 సంవత్సరాలలోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు చిన్నారుల అనుమతిని న్యాయస్థానం నిరాకరించింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సవరించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి వాయిదాను మార్చి 17కి వాయిదా వేసింది.
16 ఏళ్లలోపు పిల్లలు సినిమా థియేటర్లను సందర్శించడంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల మధ్య 16 ఏళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించరాదని కోర్టు నొక్కి చెప్పింది. సంబంధిత భాగస్వాములందరినీ సంప్రదించిన తర్వాత ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.