నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లుగా తెలుస్తోంది. మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం మరింత దిగజారినట్లు సమాచారం. ఎంఆర్ఐ స్కాన్‌లో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. తారకరత్న కోసం విదేశీ వైద్యులు రంగంలోకి దిగారు. అత్యవసర చికిత్స కొనసాగుతోందని సమాచారం. తారకరత్న పరిస్థితి బాగా లేదని తెలుసుకుని నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ రోజు సాయంత్రం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ను విడుదల చేసే అవకాశం ఉందని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి.
నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం రోజున జనవరి 27న తారకరత్న కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయాలయకు తరలించారు.