ది కేరళ స్టోరీ సినిమాను వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. ది కేరళ స్టోరీ సినిమాను తమిళనాడులోని అన్ని మల్టిప్లెక్స్ థియేటర్లలో నిలిపివేశారు. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతోపాటు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లో షోలు రద్దు చేశారు. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి పార్టీ శనివారం చెన్నైలో నిరసనకు దిగింది. సినిమాకు వ్యతిరేకంగా చెన్నై అన్నానగర్ అర్చ్ స్కై వాక్ మాల్ వద్ద పార్టీ అధినేత నటుడు, దర్మకుడు సీమన్ నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా.. తమిళ నాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.8.03 కోట్లు రాబట్టిన ఈ సినిమా శనివారం ఒక్కరోజే రూ.11.22 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 39.73% వృద్ధి కనబర్చింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.19.25 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.