మీర్జాపూర్.. అమెజాన్ లో వచ్చే ఈ వెబ్ సిరీస్ కు ఎంతో మంది ఫ్యాన్స్ దేశ వ్యాప్తంగా ఉన్నారు. ఇప్పటికి రెండు సీజన్లు పూర్తీ అయ్యాయి. ఈ వెబ్ సిరీస్ చాలా వరకూ బూతులతో, రక్తపాతంతో నిండి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం యూపీ రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీర్జాపూర్ ప్రాంతాన్ని చాలా దారుణంగా చూపించారు ఈ వెబ్ సిరీస్ లో అంటూ ఎప్పటి నుండో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మా మీర్జాపూర్ ను అంత దారుణంగా చూపిస్తారా అంటూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ ప్రాంతాన్ని హింసాత్మకంగా చూపించడంతో అక్కడ నివసించే ఓ వ్యక్తి ఈ వెబ్ సిరీస్ మీద పిల్ దాఖలు చేశాడు. దీంతో సుప్రీం కోర్టు గురువారం నాడు మీర్జాపూర్ టీమ్‌కు, అమెజాన్ ప్రైమ్ వీడియోకు నోటీసులు జారీ చేసింది.
ఈ వెబ్‌సిరీస్‌పై లక్నో, మీర్జాపూర్‌లో ఇదివరకే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈ సిరీస్‌లో మత, ప్రాంతీయ, సామాజిక మనోభావాలను దెబ్బతీయడంతో పాటు అక్రమ సంబంధాలను ఎక్కువ ఫోకస్ చేశారంటూ మీర్జాపూర్‌లోని అర్వింద్ చతుర్వేది పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మీరకు పోలీసులు సదరు వెబ్‌సిరీస్ నిర్మాతలతో పాటు, దాన్ని ప్రసారం చేసిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ మీద కూడా సోమవారం నాడు కేసు నమోదు చేశారు.
ఈ సిరీస్ మీద మీర్జాపూర్ ఎంపీ అనుప్రియ పటేల్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మీర్జాపూర్ ప్రశాంతతకు కేంద్రంగా ఉందని, కానీ వెబ్ సిరీస్‌లో ఈ నగరాన్ని హింసాత్మకంగా చూపించి దాని ప్రతిష్టను దిగజార్చారని ఆరోపణలు గుప్పించారు.