హ‌త్య కేసులో హీరోకు బెయిల్.. హైకోర్టు తీర్పుపై 'సుప్రీం' సీరియ‌స్‌

సినీ నటుడు దర్శన్ తూగుదీప్ కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

By Medi Samrat
Published on : 24 July 2025 3:49 PM IST

హ‌త్య కేసులో హీరోకు బెయిల్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం సీరియ‌స్‌

సినీ నటుడు దర్శన్ తూగుదీప్ కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ కేసులో దర్శన్ కర్ణాటక హైకోర్టు నుండి బెయిల్ పొందారు. అయితే సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని 'న్యాయ అధికార దుర్వినియోగం' అని పేర్కొంది. హత్య వంటి తీవ్రమైన కేసుల్లో బెయిల్ ఆర్డర్ ఇవ్వరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కర్ణాటక హైకోర్టు ప్రాథమికంగా బెయిల్ మంజూరు చేయడం.. న్యాయపరమైన అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని కోర్టు పేర్కొంది.

2024 జూన్‌లో రేణుకాస్వామి అనే 33 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో క‌న్న‌డ హీరో దర్శన్ ప్రధాన నిందితుడు. కర్ణాటక హైకోర్టు నుంచి ఆయనకు బెయిల్ లభించింది. దీనిపై సుప్రీంకోర్టు ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసింది.

గత వారం కూడా ఈ బెయిల్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. హైకోర్టు న్యాయపరమైన అధికారాన్ని సరిగ్గా ఉపయోగించలేదని పేర్కొంది. ఈసారి హైకోర్టు తీర్పులోని భాషపై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

దోషులనో, నిర్దోషులనో తీర్పు ఇవ్వబోమని.. అత‌డిని నిర్దోషిగా విడుదల చేయాలని హైకోర్టు ఏమైనా ఆదేశించిందా? అని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన‌ భాష, తర్కం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా హత్యకేసులో అరెస్టుకు కారణాలు చెప్పలేదని హైకోర్టు చేసిన ప్రకటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతి కేసులో హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఇస్తుందా అని జస్టిస్ పార్దీవాలా ప్రశ్నించారు. నిందితుడిని ఇప్పటికే నిర్దోషిగా పరిగణించినట్లు అనిపిస్తోందని కూడా కోర్టు పేర్కొంది.

Next Story