ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్.. నిలకడగానే ఆరోగ్యం
Super Star Rajinikanth admitted to Chennai Hospital.సౌత్ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చైన్నైలోని కావేరి ఆస్పత్రిలో
By తోట వంశీ కుమార్
సౌత్ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చైన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం సాయంత్రం 4.30గంటలకు రజనీ ఆస్పత్రిలో చేరినట్లు కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. 70 ఏళ్ల రజనీ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకోవడం కోసం ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అవార్డు తీసుకున్న అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో పాటు ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిశారు. అనంతరం రెండు రోజుల క్రితమే ఆయన చెన్నైకి వచ్చారు.
బుధవారం రాత్రి తాను నటించిన 'అన్నాత్తే' చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. గురువారం ఆయన ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆస్పత్రికి తరలివచ్చారు. కాగా.. రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆయన భార్య లతా మాట్లాడుతూ.. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. ప్రతి సంవత్సరం లాగానే సాధారణ హెల్త్ చెకప్ కోసం ఆయన ఆస్పత్రికి చేరారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కాగా.. ఆయన శుక్రవారం మొత్తం ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారు.
ఇదిలా ఉంటే.. ఆయన నటించిన 'అన్నాత్తే' చిత్రం తెలుగు 'పెద్దన్న' పేరుతో దీపావళి కానుకగా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్న చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.