సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబుకు మాతృవియోగం కలిగింది. సీనియర్ నటుడు కృష్ణ సతీమణి ఇందిరాదేవి కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం ఇంట్లోనే తుది శ్వాస విడిచింది. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం. కుమారులు రమేశ్‌బాబు, మహేష్‌బాబులతో పాటు కుమారైలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ఇద్దరు కొడుకులు సినిమాల్లో ఉన్నా ఏ రోజు సినిమా వేడుకలకు హాజరు కావడానికి ఉత్సాహం చూపేవారు కాదు ఇందిరాదేవి. తల్లి అంటే మహేష్‌బాబుకు ఎంతో ఇష్టం. ఎలాంటి సందర్భం అయినా తన తల్లి గురించి మాట్లాడకుండా మహేష్ ఉండలేరు. ఇక మహేష్ కుమార్తె సితార, కొడుకు గౌతమ్‌లకు కూడా నానమ్మ ఇందిరా దేవి అంటే చాలా ఇష్టం. సమాయం దొరికినప్పుడల్లా ఆమెతో కలిసి సరదాగా గడిపేవారు.
కొద్ది నెలల క్రితమే రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడిప్పుడే ఘట్టమనేని కుటుంబం భాద నుంచి బయట పడుతున్న టైంలో ఇందిరాదేవి మరణించడంతో మహేష్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం ఇందిరాదేవి పార్థివదేహాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.