హైదరాబాద్ నగరం కేపీహెచ్‌పీ పరిధిలో ఉన్న ఓ ప్రముఖ మాల్లో నిర్వహించిన ది రాజా సాబ్ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఇబ్బందులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాజా సాబ్ సినిమా పాట విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కార్యక్రమానికి హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో కొందరు పోకిరిలు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై కేపీహెచ్‌పీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసినట్లుగా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని సీఐ స్పష్టం వ్యక్తం చేశారు. రద్దీ ఉండే ప్రదేశాల్లో ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, భద్రత చర్యలు పాటించాలని హెచ్చరించారు. ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నిర్వాహకులతో పాటు మాల్ యజమాన్యంపై కూడా కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
మరోవైపు హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అభిమానం ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉండకూడదు అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.