పోసాని ఇంటిపై రాళ్ల దాడి
Stone attack on Posani Krishna Murali house.సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు
By తోట వంశీ కుమార్ Published on 30 Sep 2021 6:49 AM GMT
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలోని పోసాని నివాసం పై రాత్రి 2 గంటల సమయంలో రాళ్లతో దాడి చేశారు. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ దాడిలో పోసాని ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఊహించని ఈ ఘటనతో వాచ్‌మెన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ఘటనపై ఎస్ఆర్‌నగర్ పోలీసులకు వాచ్‌మెన్ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీకెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
కాగా.. ఘటన జరిగిన సమయంలో పోసాని గానీ, ఆయన కుటుంబ సభ్యులు గాని అక్కడ లేనట్లుగా తెలుస్తోంది. గత ఎనిమిది నెలలుగా పోసాని మరో చోట ఉంటున్నారు. పోసాని వరుసగా రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం అనంతరం ఇంటికి వెలుతున్న పోసానిపై జనసేన కార్యకర్తలు దాడికి యత్నంచిన సంగతి తెలిసిందే.