ప్రముఖ రంగస్థల నటులు, దర్శకుడు, నవలా రచయిత తల్లావఝ్జుల సుందరం మాస్టారు కన్నుమూశారు. చిక్కడపల్లిలోని ఆయన నివాసంలో సోమవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని తన మిత్రుడు తనికెళ్ల భరణికి ఫోన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు శిష్యులు ఇంటికి చేరుకుని ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
1950 అక్టోబరు 29న ఏపీలోని ఒంగోలులో సుందరం మాస్టారు జన్మించారు. బీఎస్సీ వరకు చదివిన అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో రంగ స్థల కళల విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆయన.. తన జీవితాన్ని నాటక రచన, ప్రదర్శనలకు అంకితం చేశారు. రెండు వందలకు పైగా నాటకాల్లో నటించారు. తెలుగు నాటక రంగానికి హాస్యంతో కొత్త శైలి చూపించారు. ఆయన భార్య శిరీష నాలుగేళ్ల క్రితం మరణించారు. కొడుకు, కుమారై అమెరికాలో ఉంటున్నారు. వారు వచ్చిన తరువాత ఈ నెల 23న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయని సన్నిహితులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు రంగస్థల నటులు, ప్రముఖులు నివాళులర్పించారు.