శ్రీకారం సినిమా రివ్యూ..!

Srikaram Movie Review. శర్వానంద్ కొత్త సబ్జెక్టులతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటారు. 'శ్రీకారం' సినిమా రివ్యూ.

By Medi Samrat  Published on  11 March 2021 2:52 PM IST
Srikaram Movie Review

శర్వానంద్ కొత్త సబ్జెక్టులతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటారు. కెరీర్ లో మంచి పీక్ సమయంలో ఉన్నప్పుడు వ్యవసాయం మీద పూర్తి స్థాయి సినిమా అంటూ 'శ్రీకారం' సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడు శర్వానంద్. ఇలాంటివి కమర్షియల్ గా సక్సెస్ అవుతాయా లేక.. సినిమాటిక్ గా ఉంటాయా అన్నది చెప్పలేము.. అయితే మంచి సినిమాల కోవలోకి ఈ సినిమాలు వస్తాయి. అలాంటి మంచి సినిమానే శ్రీకారం. వ్యవసాయం రాబోయే కాలంలో ఎంత ముఖ్యమో చెప్పే సినిమా కూడా..! ఒకప్పుడు రైతే రాజు.. కానీ ఇప్పుడు ఆ రైతులు సొంత ఊళ్లను వదిలేసి టౌన్లలో ఏవేవో పనులు చేసుకుంటూ గడిపేస్తూ ఉన్నారన్నది మనకు తెలిసిన అంశమే.. కానీ సమిష్ఠి వ్యవసాయానికి రైతులు మరిలేలా ఎలా శ్రీకారం చుట్టాడనేది ఈ సినిమాలో చూపిస్తారు. కొత్త దర్శకుడు బి కిషోర్ శ్రీకారం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శర్వాకు జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. శ్రీకారం సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

కథ:

అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్ (శర్వానంద్) హైదరాబాద్ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా మంచి పేరు సంపాదించడమే కాకుండా లక్షల్లో జీతం సంపాదిస్తూ తండ్రి చేసిన అప్పులను తీరుస్తూ ఉంటాడు. ఇక చైత్ర(ప్రియాంకా అరుళ్‌ మోహన్)కు కార్తీక్ అంటే చాలా ఇష్టం.. అతడిని పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా అతడి చుట్టూ తిరుగుతూ ఉంటూ ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించాలని అనుకుంటూ ఉండగా.. కార్తీక్ మాత్రం తన తండ్రి మాటను కాదని మరీ వ్యవసాయం చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు. అసలు కార్తిక్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? అనంతరాజపురంలో కార్తీక్ ను వ్యవసాయం చేయకుండా అడ్డుకున్నదెవరు..? వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపించాడా..? అన్నది తెలియకుండా ఉండాలంటే సినిమా చూడాల్సిందే..!

నటీనటులు:

సినిమా మొత్తం శర్వానంద్ చుట్టూనే తిరుగుతుంది. శర్వా మాత్రం అటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానూ.. టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు సృష్టించే ఆదర్శ రైతుగానూ ఎంతో బాగా చేశాడు. చైత్ర పాత్రలో ప్రియాంక అరుళ్ మోహన్ కూడా క్యూట్ గా మెప్పించింది. వ్యవసాయం చేసి.. అలసిపోయిన రైతు పాత్రలో రావు రమేష్ మరోసారి మెప్పించాడు. తండ్రి కేశవులు పాత్ర చేసిన రావు రామేశ్‌ కొన్ని సన్నివేశాల్లో కంటనీరు తెప్పిస్తాడు‌. ఏకాంబరం పాత్రలో సాయి కుమార్‌, హీరో తల్లిగా ఆమని, నరేశ్‌, మురళి శర్మ, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ:

సినిమా నిడివి తక్కువగా ఉండడం సినిమాకు ఓ పెద్ద ప్లస్..! కానీ కమర్షియల్ సినిమా తరహాలో అంచనా వేసుకుని వెళ్తే మాత్రం నిరుత్సాహ పడాల్సి ఉంటుంది. రైతులు పడుతున్న కష్టాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయినప్పటికీ.. అదేదో డాక్యు డ్రామాగా సినిమా సాగిపోతున్నట్లు కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది. రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బి.కిశోర్‌. రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు వారిని ఎలా పీక్కుతింటున్నారు, రైతులు టెక్నాలజీని వాడుకోవడంలో విఫలం ఎలా అవుతున్నారు అనే విషయాలన్నీ ఈ సినిమాలో చూపించారు. మంచి సందేశాత్మక కథ అయినప్పటికీ.. కొత్తదనం లేకపోవడం మైనస్ గా అనిపిస్తుంది. కథ కూడా పెద్దగా ముందుకు సాగుతున్న‌ట్టు అనిపించదు. మిక్కీ జె. మేయర్ సంగీతం పర్లేదు. పెంచలదాస్ రాసి పాడిన 'వస్తానంటివో' పాట, ఫస్టాఫ్ లో వచ్చే 'హే అబ్బాయి' పాటలు మాత్రమే గుర్తుంటాయి. సాయి మాధవ్‌ బుర్రా రాసిన డైలాగ్స్ సినిమా అయిపోయాక కూడా వెంటాడుతాయి‌. క్లైమాక్స్ లో కాలేజీ ఆడిటోరియం సీన్ యువతను ఆలోచింపజేస్తాయి. సినిమా నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఎడిటర్‌ మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఇంకాస్త పని చెప్పి ఉండాల్సింది అని అనిపించక మానదు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. శర్వానంద్ నటన, డైలాగ్స్ సినిమాకు ప్లస్ గా మిగిలాయి తప్పితే అంత గొప్పగా మాత్రం సినిమా అనిపించకపోవచ్చు. నితిన్ శ్రీనివాసకళ్యాణం సినిమాలో పెళ్లి యొక్క గొప్పతనం గురించి ఎలా చెప్పించారో.. ఈ సినిమాలో రైతు గొప్పతనం.. వ్యవసాయం.. గురించి హీరోతో చెప్పించారు.

రేటింగ్: 2/5


Next Story