'జగదేక వీరుడు అతిలోక సుందరి' రీరిలీజ్.. భారీ ప్లాన్
తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌లలో ఒకటైన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలై మూడు దశాబ్దాలు దాటింది.
By Medi Samrat
తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌లలో ఒకటైన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలై మూడు దశాబ్దాలు దాటింది. చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సోషియో-ఫాంటసీ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నిర్మాత అశ్విని దత్, అతని వైజయంతి మూవీస్ బ్యానర్‌కు అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. 1990, మే 9న విడుదలైన ఈ సినిమా రీరిలీజ్ కాబోతోంది.
మే 9, 2025న ఈ సినిమాను త్రీడీ, 2డీలో విడుదల చేస్తున్నట్లు వైజయంతి మూవీస్ సంస్థ స్పష్టం చేసింది. ఈ సినిమాలోని పాటలు, డ్యాన్స్ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పొచ్చు.సుందరం, ప్రభుదేవా కొరియోగ్రఫీ, మాస్ట్రో ఇళయరాజా అద్భుతమైన బాణీలకు అందరూ ఫిదా అయ్యారు. 1990 మే 9న విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ. 15 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పట్లోనే ఈ సినిమా రూ. 9 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఒక వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నటుల పారితోషికం గురించి మాట్లాడుతూ, “నేను చిరంజీవికి దాదాపు రూ. 35 లక్షలు, శ్రీదేవికి రూ. 25 లక్షలు ఇచ్చాను. ఆ సమయంలో ఆమె క్రేజ్ అలా ఉంది. ఆమె స్టార్ హీరోలతో సమానంగా డబ్బులు తీసుకునేవారు.” అని అశ్విని దత్ తెలిపారు. ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ చేయాలనే ప్రణాళిక ఇంకా ఉందని అశ్విని దత్ ధృవీకరించారు.