సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నప్పటికి రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకుంటున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలకు బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు పంపించాడు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చాడు. అడినవారికి లేదనకుండా సాయం చేస్తున్నాడు. తన దాతృత్వంతో ఇప్పటికే అందనంత ఎత్తు ఎదిగిన ఈ రీల్ హీరో మరోసారి రియల్ హీరోగా నిలిచాడు.
తాజాగా సోనూసూద్ మరోసారి తన మంచిమనసును చాటుకున్నాడు. ఆచార్య సినిమా కోసం పనిచేస్తున్న సిబ్బందికి సోనూసూద్ వంద స్మార్ట్‌ఫోన్లు అందజేశాడు. సినిమా కోసం పనిచేసిన సిబ్బంది చాలా బీదరికంలో ఉన్నారని.. వారి పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కూడా వినియోగించే పరిస్థితిలో లేరని గ్రహించాడు. వెంటనే ఆచార్య యూనిట్ మెంబర్స్ కు 100 స్మార్ట్ ఫోన్లను సోనూసూద్ స్వయంగా అందజేసి మానవతా హృదయాన్ని చాటుకున్నాడు. సోనూసూద్ చేసిన పనిని అందరూ అప్రిషియేట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో సోనూసూద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం కోకాపేట్ లో వేసిన సెట్‌లో ఆచార్య షూటింగ్ కొనసాగుతుంది. కాగా.. సోనూసూద్ కీలక పాత్రలో నటించిన 'అల్లుడు అదుర్స్' సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదలవుతుంది.