కరోనా మహమ్మారి తరువాత సంక్రాంతికి విడుదలైన క్రాక్ చిత్రం థియేటర్లకు కొత్త జోష్ తెచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నప్పటికీ.. సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం ఏకంగా రూ.20కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రూ.17 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా ఇప్పుడు లాభాల్లోకి వచ్చేసింది. రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఇటీవల కాలంలో తెలుగు సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేసి భారీ హిట్లు సొంతం చేసుకుంటున్న వారి జాబితా కొంచెం పెద్దదిగానే. తాజాగా క్రాక్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు నిర్మాతలు పోటీపడుతున్నారట. అయితే.. ప్రస్తుతం ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. అదేంటంటే..? లాక్‌డౌన్ కాలంలో రియల్ హీరోగా మారిన సోనూసూద్ ఈ చిత్రంతో బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దంచేసుకుంటున్నాడట. కాగా.. ప్రతినాయక పాత్రల్లో తనని ప్రజలు చూడలేకపోతున్నారని.. ఇక నుంచి తాను విలన్ పాత్రల్లో నటించను ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ చెప్పిన సంగతి తెలిసిందే.
పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో బాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని సోనూసూద్ అనుకుంటున్నాడట. రీమేక్ హక్కుల కోసం క్రాక్ నిర్మాత ఠాగూర్ మధుతో సోనూ సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రాన్ని స్వయంగా ఆయనే నిర్మించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటీకే రీమేక్ రైట్స్ కోసం నిర్మాత బి.మధును సోనూసూద్ సంప్రదించారని.. వారిద్దరి మధ్య బేరసారాలు జరుగుతున్నాయని టాక్ వినబడుతోంది. మరీ అసలు నిజం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.