బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా కుమారైగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సోనాక్షి సిన్హా. అయితే చాలా తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. వరుస చిత్రాలతో పుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది. ఓ చీటింగ్ కేసులో ఆమెపై ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌కి చెందిన ఏసీజేఎమ్ (అడిషనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్) కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ పట్టణం కట్ఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమోద్ శర్మ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతడు ఈవెంట్ లు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసి.. దానికి ముఖ్య అతిథిగా సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. అయితే.. ఆ కార్యక్రమానికి సోనాక్షి సిన్హా హాజరు కాలేదు. అయితే.. సోనాక్షి ఆ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు రూ.37 లక్షలు ఇచ్చాడు. ఆమె రాకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరగా.. అందుకు సోనాక్షి మేనేజర్ తిరస్కరించాడు. సోనాక్షి సిన్హాను స్వయంగా కలిసి ఎన్నో సార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ప్రమోద్ మోసం కేసు దాఖలు చేశాడు. కేసు విచారణ నిమిత్తం ఆమె మొరాదాబాద్‌కు రావాల్సి ఉండగా.. ఆమె హాజరు కాలేదు. దీంతో స్థానిక న్యాయస్థానం ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.