శోభిత ధూళిపాళ.. మన తెలుగు అమ్మాయే..! తెలుగులో తక్కువ అవకాశాలు ఉన్నా.. బాలీవుడ్ లో మాత్రం చాలా బిజీగా ఉంది. పలు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతోంది. తెనాలికి చెందిన శోభిత తెలుగులో గూఢచారి సినిమాలో మాత్రమే కనిపించింది. కానీ బాలీవుడ్ లో మాత్రం 'రామన్ రాఘవ్ 2.0' సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం అలా సాగుతూనే ఉంది. పలు వెబ్ సిరీస్ లలోనూ మెప్పించింది. ప్రస్తుతానికి మేజర్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లు చేస్తూ వెళుతోంది. తాజాగా హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది శోభిత.
స్లమ్‌డాగ్ మిలియనీర్ మూవీ ఫేం, బ్రిటన్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కే 'మంకీ మాన్' చిత్రంలో శోభితా నటించబోతోంది. దేవ్ పటేల్ దర్శకతం వహిస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. పాల్ అంగునావెలా, జాన్ కొలీ రచన సహాకారంతో దేవ్ పటేల్ ఈ చిత్రానికి తెరకెక్కించనున్నారు. ఇందులో దేవ్ పటేల్‌తో పాటు షార్ల్టో కోప్లీ, సికందర్ ఖేర్ నటించనున్నారు. ఈ సినిమా 2022లో విడుదల కానుంది.