సింగర్ యశస్వి కొండేపూడి.. తెలుగు టీవీ షోల ద్వారా, తన పాటల ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే అతడిపై ఇప్పుడు చీటింగ్ ఆరోపణలు వచ్చాయి. తనదికాని సంస్థను తనదని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఉన్నారు. ఎన్జీవో సంస్థను నడుపుతూ ఎంతో మంది అనాథ పిల్లల బాగోగులు చూసుకుంటున్నట్టు యశస్వి చెప్పిందంతా అబద్ధమేనని ఆ సంస్థ రియల్ నిర్వాహకులు చెప్పుకొచ్చారు.
కాకినాడలోని నవసేన ఫౌండేషన్ పేరుతో ఉన్న ఎన్జీవో సంస్థ యాభై-అరవై మంది అనాథ పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉంది. ఆ సంస్థ తనదే అంటూ సింగర్ యశస్వి గతంలో చెప్పుకొచ్చాడు. నవసేన ఫౌండేషన్ లో ఉంటోన్న పిల్లలతో ఫొటోలు దిగి పాపులారిటీ కోసం వినియోగించుకున్నాడు. సింగర్ యశస్వి మోసం చేస్తున్నారని కాకినాడ నవసేన ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా కౌసర్ ఆరోపించారు. తన సంస్థను ఆయన సంస్థ అని చెప్పుకుంటూ యశస్వి మమ్మల్ని మోసం చేశాడని అంటున్నారు. గత ఐదేళ్లుగా తన సొంత డబ్బుతోనే 56 మంది పిల్లలను పోషిస్తూ చదివిస్తున్నానని.. నవసేన ఫౌండేషన్‌కు ఏ సెలెబ్రిటీ నుంచి సహకారం లేదని అన్నారు. తమ సంస్థ పేరును వాడుకోవడమే కాకుండా, తానే నడుపుతున్నట్లు చెప్పుకుంటోన్న యశస్విపై చర్యలు తీసుకోవాలని కోరారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చొరబడినట్టు ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.