బాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ సింగ‌ర్ కేకే హ‌ఠాన్మ‌ర‌ణం.. చివ‌రి పాట ఇదే

Singer KK Dies After Concert In Kolkata.బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ గాయ‌కుడు కృష్ణకుమార్ కున్నత్(కేకే)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2022 8:24 AM IST
బాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ సింగ‌ర్ కేకే హ‌ఠాన్మ‌ర‌ణం.. చివ‌రి పాట ఇదే

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ గాయ‌కుడు కృష్ణకుమార్ కున్నత్(కేకే) క‌న్నుమూశారు. బుధ‌వారం రాత్రి కోల్‌క‌తాలోని న‌జురుల్ మంచా ఆడిటోరియంలో ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన అనంత‌రం హోట‌ల్‌కు చేరుకున్న‌కేకే త‌న గ‌దిలో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు. దీంతో వెంట‌నే అత‌డిని సీఎంఆర్ఐ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అక్క‌డ‌కు తీసుకువ‌చ్చే స‌మ‌యానికి అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. కేకే వ‌య‌స్సు 53 సంవ‌త్స‌రాలు.

కేకే త‌న మ‌ర‌ణానికి ముందు త‌ను ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్న‌పోస్టుల‌ను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు. ఆయ‌న హఠాన్మరణంతో అభిమానులు షాక్‌కు గురైయ్యారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.


'కేకే పాటలు అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా, అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించాయి. పాటల ద్వారా ఆయనను మేం ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు సంతాపం' అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

కేకే మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆయన మరణం విచారకరమని, చిత్ర పరిశ్రమకు ఎంతో నష్టమని బాలీవుడ్‌ నటుడు అక్ష‌య్ కుమార్‌ ట్వీట్‌ చేశారు.

ఢిల్లీలో జ‌న్మించిన కేకే 1999లో బాలీవుడ్ చిత్రం 'పాల్' సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యారు. గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక చిత్రాల్లో చాలా హిట్ పాట‌లు పాడారు. తెలుగులో 'ఇంద్రా', 'సంతోషం', 'ఘర్షణ', 'గుడుంబా శంకర్‌', 'నేనున్నాను', 'సైనికుడు' తదితర చిత్రాల్లో పాటలు పాడారు.

మ‌ర‌ణానికి ముందు చివ‌రి వీడియో..

కేకే త‌న మ‌ర‌ణానికి ముందు చివ‌రి వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిలో కేకే త‌న సొంత ఆల్భ‌మ్ 'పాల్‌'లోని టైటిల్ సాంగ్ 'పాల్' పాడాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story