అశ్లీలత కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ఉపశమనం లభించింది. ఆ కేసును ముంబై కోర్టు కొట్టేసింది. 2007లో రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ నటి శిల్పాశెట్టిని ముద్దుపెట్టుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో దుమారం రేపింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేతకి చవాన్ ప్రకారం.. ఘటన జరిగిన కొద్దిసేపటికే శిల్పా శెట్టి తన వైఖరిని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల నివేదిక, సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాత, శిల్పాశెట్టిపై అభియోగాలు నిరాధారమైనవని మేజిస్ట్రేట్ సంతృప్తి చెందారు. అందుకే ఆమెను ఈ అశ్లీలత కేసు నుండి విడుదల చేశారు.
2007లో రిచర్డ్ గేర్, శిల్పాశెట్టిలపై అశ్లీలత ఆరోపణలపై రాజస్థాన్‌లో రెండు, ఘజియాబాద్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. కేసును ముంబైకి బదిలీ చేయాలంటూ శిల్పాశెట్టి చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు 2017లో అనుమతించింది. న్యాయవాది మధుకర్ దాల్వీ ద్వారా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 239 , సెక్షన్ 245 (సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విడుదల) కింద నటి డిశ్చార్జ్ కోసం దాఖలు చేసింది. "రిచర్డ్ గేర్ ఆమెను ముద్దుపెట్టుకున్నప్పుడు.. ఆమె నిరసన వ్యక్తం చేయలేదనేది మాత్రమే" ఆమెపై వచ్చిన ఆరోపణ అని ఆమె దరఖాస్తులు పేర్కొన్నాయి. శిల్పాశెట్టి గత ఏడాది తన భర్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేయడంతో వార్తల్లో నిలిచింది. రాజ్‌కుంద్రా ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు.