యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం 'బైకర్' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి, హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో శర్వానంద్ వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు.
ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర పోషించగా, మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యం కోసం శర్వానంద్ ఏకంగా 22 కిలోల బరువు తగ్గడం విశేషం. కెరీర్ మలుపు తిప్పే విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, సినిమాకు ఆయన చేసిన ఈ నమస్కారం తాలూకు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా భావిస్తున్న ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి శర్వానంద్ కన్నీటి పర్యంతమయ్యారు.