'డుంకీ' ట్రైలర్' విడుదల
షారుఖ్ ఇప్పుడు 'డుంకీ' సినిమాతో మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 'డుంకీ' చిత్రయూనిట్.. తాజాగా డ్రాప్ 4 అంటూ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది.
By అంజి Published on 5 Dec 2023 1:00 PM IST'డుంకీ' ట్రైలర్' విడుదల
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా హిట్‌తో ఊపు మీదున్న షారుఖ్ ఇప్పుడు 'డుంకీ' సినిమాతో మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 22న ప్రభాస్ 'సలార్' రిలీజ్ కానుండగా, దానికి ఒక్క రోజు ముందు షారుక్ 'డుంకీ' మూవీ విడుదల కానుంది. మొదట డిసెంబర్ 22నే ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల అయితే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్లపై కూడా తీవ్రంగా ప్రభావం పడుతుందని ఒక్క రోజు ముందుకు జరిపారు. నెల కొందట డ్రాప్ 1 అంటూ టీజర్ రిలీజ్ చేసిన 'డుంకీ' చిత్రయూనిట్.. తాజాగా డ్రాప్ 4 అంటూ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది.
హార్డీ (షారుఖ్) తన కథను వివరించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇది 1975లో పంజాబ్‌లోని లాల్టులో ప్రారంభమైంది. అక్కడ అతను లండన్‌కు వెళ్లాలనుకునే తన నలుగురు స్నేహితులను కలుసుకున్నాడు. అయితే ఇంగ్లీష్ రాదనే కారణంగా లండన్ వెళ్లేందుకు ఇంగ్లాండ్ వీరికి వీసా ఇచ్చేందుకు నిరాకరిస్తుంది. బ్యాక్ డోర్ ద్వారా వీరంతా లండన్‌కి ఎలా వెళ్లారు? ఆ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? అక్కడికి వెళ్లి ఏం చేశారు అనేదే 'డుంకీ' స్టోరీ. రాజ్ కుమార్ హిరాణీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై డుంకీని రాజ్‌కుమార్ హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు.