ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కావడంతో అంతా ఆయన ఇళ్లు మన్నత్ వద్దకు చేరుకున్నారు. కానీ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. తమ అభిమాన హీరో బయటకు వచ్చి కనిపిస్తాడని అనుకోగా షారుఖ్ మాత్రం వారిని పలకరించలేకపోయాడు. అభిమానులకు క్షమాపణలు చెప్తూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘మీ అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా నిర్ణయం భద్రమే కోసమే. మీరంతా చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత నాకు అత్యంత విలువైనది. మిమ్మల్ని చూడలేకపోయినా మీకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. అతి త్వరలోనే మీ అందరినీ కలుసుకొని నా ప్రేమను తెలియజేయడం కోసం ఎదురుచూస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.
నవంబర్ 2, 2025న షారుఖ్ ఖాన్ కు 60 ఏళ్లు నిండాయి. ప్రతి సంవత్సరం, ఖాన్ మన్నత్ బాల్కనీలోకి వచ్చి తన అభిమానులకు చేతులు ఊపడం ఒక ఆనవాయితీ. వేలాది మంది తమ హీరోని చూడటానికి మాత్రమే ఆయన ఇంటి వెలుపల గుమిగూడుతూ ఉంటారు.
ఈ సంవత్సరం, షారుఖ్ తన అభిమానులను పలకరించలేదు. అయితే చాలామంది ముంబైలోని బాంద్రాలోని బాల్ గంధర్వ రంగ్ మందిర్ ఆడిటోరియంలో ఆయనను కలిశారు. ఆయన అభిమానుల సంఘం ఒక మీట్ అండ్ గ్రీట్ సెషన్‌ను ఏర్పాటు చేసింది, షారుఖ్ అక్కడికి చేరుకున్నారు.