బుల్లితెర నటుడు, కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవిద్య, అపర్ణ అనే యువతుల ఫిర్యాదు మేరకు అమర్‌పై రాయదుర్గం పోలీసులు జనవరి 27వ తేదీన కేసు నమోదు చేశారు. ఆ కేసులో అమర్‌ను అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు.. కూకట్‌పల్లి కోర్టు ఎదుట హాజరుపరిచారు. దీంతో కోర్టు సమీర్‌కు రిమాండ్ విధించడంతో.. అతనిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
అసలేం జరిగిందంటే..
శ్రీ విద్య, స్వాతి, లక్ష్మి అనే ముగ్గురు యువతులు కలిసి మణికొండలో బౌటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల స్వాతి బౌటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది. అయితే డబ్బుల విషయంలో పార్టనర్స్ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్వాతికి రావాల్సిన బకాయిలు.. శ్రీవిద్య ఇవ్వకపోవడంతో.. ఇటీవల స్వాతి తన భాయ్‌ఫ్రెండ్, నటుడు సమీర్‌తో కలిసి శ్రీ విద్య ఇంటికి వెళ్లి నిలదీశారు.
అక్కడ మాటా మాటా పెరిగి గొడవకు దారి తీయడంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దాంతో సమీర్ తాగిన మత్తులో అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే అమర్, స్వాతిలు కూడా కౌంటర్ కేసు పెట్టారు. ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.