టాలీవుడ్‌లో మరో విషాదం.. గ్యాంగ్ లీడర్ ఫేమ్ జనార్థన్ కన్నుమూత
Senior Actor Vallabhaneni Janardhan passed away.టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతి రావు మరణాలను జీర్ణించుకోకముందే మరో నటుడు కన్నుమూశారు. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్థన్ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
1959 సెప్టెంబర్ 25న వల్లభనేని జనార్థన్ జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలపై ఎంతో ఆసక్తి ఉండేది. కాలేజీ రోజుల్లో పలు నాటకాల్లో కీలక పాత్రలు పోషించారు. అనంతరం సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో సుమలత తండ్రి పాత్రలో ఆయన నటన అందరినీ అలరించింది. 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. బాలకృష్ణతో 'లక్ష్మీనరసింహ'లో, నాగార్జునతో 'వారసుడు', వెంకట్‌తో 'సూర్య ఐపీఎస్' చిత్రాల్లో ఆయన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
సినిమాల్లో నటిస్తున్న సమయంలో ప్రముఖ దర్శక, నిర్మాత విజయబాపినీడు మూడవ కూతరు లళినీ చౌదరిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు సంతానం. మొదటి అమ్మాయి శ్వేత చిన్న తనంలోనే మరణించింది. రెండవ కుమార్తె అభినయ ఫ్యాషన్ డిజైనర్‌గా, అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.