సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
Senior Actor Kaikala Satyanarayana passed Away.సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 23 Dec 2022 8:30 AM ISTసీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఫిలింనగర్‌లోని తన నివాసంలో ఈ రోజు(శుక్రవారం) ఉదయం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కైకాల సత్యనారాయణ మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కైకాల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
1935 జులై 25న కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో కైకాల సత్యనారాయణ జన్మించారు. గుడివాడ కాలేజీలో ఆయన గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. 1959లో సిపాయి కూతురు చిత్రంతో వెండి తెరపై అడుగుపెట్టారు. హీరోగా, విలన్‌గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియెన్ ఇలా అన్ని రకాల పాత్రలను పోషించారు. నవరస నట సార్వభౌమగా తెలుగు చిత్ర సీమలో ఖ్యాతి గడించారు. 60 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తో పాటు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తదితరుల చిత్రాల్లో ఎన్నో కీలక పాత్రలు పోషించారు. సుమారు 777 చిత్రాల్లో ఆయన నటించారు.