స్వామి ఓం.. హిందీ బిగ్ బాస్ చూసిన వారికి మాత్రమే కాకుండా కాస్త జనరల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులకు కూడా ఈయన అంటే తెలుసు. ఎన్నో వివాదాలకు కారణమైన స్వామి ఓం కన్నుమూశారు. తనకు తాను దేవుడిగా ప్రకటించుకుని రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న స్వామి ఓం మూడు నెలల కిందట కరోనా బారిన పడడంతో ఆరోగ్యం క్షీణించింది. 15 రోజులుగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. కరోనా బారిన పడినప్పటి నుంచి స్వామి ఓం ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని అతడి కుమారుడు అర్జున్ జైన్, స్నేహితుడు ముఖేశ్ జైన్ తెలిపారు. ఢిల్లీలోని నిగమ్ బోధ్‌లో అతడి అంత్యక్రియలు నిర్వహించారు.
బిగ్‌బాస్ 10వ సీజన్‌లో పోటీదారుడిగా పాల్గొన్నాడు. హిందీ బిగ్‌బాస్ షో చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి స్వామి ఓం. స్వామి ఓం 2017లో జరిగిన బిగ్‌బాస్ 10 షోలో అత్యంత వివాదాస్పదమయ్యాడు. హౌస్‌లో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్లపై మూత్ర విసర్జన చేయడంతో హోస్ట్‌గా ఉన్న సల్మాన్‌ఖాన్ అతడిని బహిష్కరించిన విషయం తెలిసిందే. హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం స్వామి ఓం బిగ్‌బాస్ యాజమాన్యం, హోస్ట్‌గా వ్యవహరించిన సల్మాన్ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.