టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 'మయోసైటిస్' అనే వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా సమంత వెల్లడించింది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే మరో వైపు తాను నటించిన 'యశోద' చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను సైతం షేర్ చేసి ఆశ్చర్యపరిచింది.
ఇదిలా ఉంటే.. తన అనారోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన వదంతులపై ఆమె స్పందిస్తూ బావోద్వేగానికి గురైంది. "గత కొన్ని రోజులుగా నేను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నా. ప్రస్తుతం నాకు ప్రాణాపాయం లేదు. నేను దీనిపై పోరాటం చేయాలి. ఒక్కోసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. ఒక్కోసారి ఇంత దాటి వచ్చానా అనిపిస్తుంది. కొన్ని మంచిరోజులు ఉంటాయి.. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఇలా పోరాటం చేస్తున్నది నేను ఒక్కదాన్నే కాదు. నాలా చాలా మంది పోరాటం చేస్తున్నారు. ఈ వ్యాధిపై నేను పోరాటం చేస్తా.. చివరకు గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది. " అని చెబుతూ సమంత ఎమోషనల్ అయింది.
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యశోద'. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించగా మణి శర్మ సంగీతం అందించారు.