ఆస్కార్ స్టేజీపై 'నాటు నాటు'.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
95వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట లైవ్ షో ప్రదర్శించబడుతుంది.
By అంజి Published on 1 March 2023 12:31 PM IST
ఆస్కార్ స్టేజీపై 'నాటు నాటు' పాట
మార్చి 12న జరగనున్న 95వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట లైవ్ షో ప్రదర్శించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. 'నాటు నాటు' పాట లైవ్ షోపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆస్కార్ నిర్వహకులు స్పందించారు. ఆస్కార్ స్టేజీపై 'నాటు నాటు' పాట సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ చేత ప్రదర్శించబడుతుందని కన్ఫామ్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే, రామ్ చరణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ కూడా వారితో వేదికపైకి రావడం గురించి ఎలాంటి సమాచారం లేదు.
'నాటు నాటు' పాటకు కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ అద్భుతమైన పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్పులు వేశారు. ఎస్ ఎస్ రాజమౌళి యాక్షన్ ఎపిక్ 'ఆర్‌ఆర్‌ఆర్' నుండి మరపురాని సన్నివేశాలలో ఇది ఒకటి. గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాటను ప్రదర్శించడానికి లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌కి వెళ్లనున్నారు. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్'.. రిలీజైన మొదటి నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది.
ఈ పాట హిందీలో నాచో నాచోగా, తమిళంలో నాట్టు కూతుగా, కన్నడలో హల్లి నాటుగా, మలయాళంలో కరింతోల్ పేరుతో విడుదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడికి కొన్ని నెలల ముందు, కైవ్‌లోని మారిన్స్కీ ప్యాలెస్ (ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్)లో దీనిని చిత్రీకరించారు. నాటు నాటు యూట్యూబ్‌లో 122 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించి వైరల్ సంచలనంగా మారింది. 'నాటు నాటు' పాట ఇప్పటికే చాలా పెద్ద అవార్డులను గెలుచుకుంది. జనవరిలో ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్స్‌ను గెలుచుకుంది. ఇది క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ యొక్క 28వ ఎడిషన్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంతో పాటు ఉత్తమ పాట అవార్డు పొందింది. ఈ సినిమాలో నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకుంది.