ఆ విష‌యాలు చెప్పొద్ద‌ని రాజ‌మౌళి న‌డుం గిల్లిన ఎన్టీఆర్‌

RRR Movie Team Special press meet in Hyderabad.ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2021 11:54 AM IST
ఆ విష‌యాలు చెప్పొద్ద‌ని రాజ‌మౌళి న‌డుం గిల్లిన ఎన్టీఆర్‌

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్( రౌద్రం, ర‌ణం, రుధిరం)'. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. డిసెంబ‌ర్ 9న‌ ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. విశేష స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ‌కు చిత్ర‌బృందం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ మేర‌కు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం శ‌నివారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించింది. మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భ‌ట్‌, నిర్మాత డీవీవీ దాన‌య్య స‌మాధానం ఇచ్చారు. దాదాపు గంటా న‌ల‌భై అయిదు నిమిషాల‌కు పాటు ప్రెస్‌మీట్ కొన‌సాగింది. ముంబైలో ప్రోగ్రామ్ ఉండ‌డంతో ఆలియా భ‌ట్ ప్రోగ్రామ్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయింది.

ఆర్ఆర్ఆర్ మీడియా స‌మావేశంలో రాజ‌మౌళి, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ గిల్లుడులు న‌వ్వులు పూయించింది. షూటింగ్‌లో జ‌రిగిన విష‌యాల‌ను రాజ‌మౌళి చెబుతున్న‌ప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్.. రాజమౌళి న‌డుం గిల్లారు. వెంట‌నే రాజ‌మౌళి లేచి ప‌క్క‌కు వెళ్లి తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పారు. రాజ‌మౌళి ఏం చెప్పారంటే.. సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్న‌ట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ 300 రోజులు జ‌రిగి ఉంటే.. అందులో వీరిద్ద‌రి కార‌ణంగా 25 రోజులు వృథాగా పోయాయ‌న్నారు.

ఇద్ద‌రికీ 30 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చింద‌ని, ఇద్ద‌రికీ పెళ్లిళ్లు జ‌రిగాయ‌ని, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌న్నారు. అయితే.. సెట్లో మాత్రం ఇద్ద‌రు గొడ‌వ ప‌డ‌తార‌న్నారు. షూటింగ్ జ‌రిగే స‌మ‌యంలో ఎన్టీఆర్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి జ‌క్క‌నా.. చ‌ర‌ణ్ న‌న్ను గిల్లాడు అని చెబుతాడ‌ని, అయితే.. అప్పుడు చ‌ర‌ణ్ తాను ఎప్పుడు గిల్లాను అని.. తాను స్క్రిప్ట్ లోని లైన్లు చ‌దువుకుంటున్నాన‌ని చెబుతాడని చెప్పారు. ఇలా సెట్లో ఇద్ద‌రూ స‌ర‌దగా గొడ‌వ ప‌డుతుంటార‌ని రాజ‌మౌళి చెప్పారు. ఈ విష‌యాలు చెబుతున్న క్ర‌మంలోనే చెప్ప‌వ‌ద్దంటూ తార‌క్‌.. జ‌క్క‌న్న న‌డుం గిల్లాడు. రాజ‌మౌళి చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తుంటే.. షూటింగ్ ఎంత స‌ర‌దాగా సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక ప్రోగ్రామ్ అయిపోయాక చరణ్, ఎన్టీఆర్ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ క్ర‌మంలో ఒక‌రి వెనుకాల మ‌రొక‌రు చేయి వేసుకున్నారు. ఈ స‌మ‌యంలో ఎన్టీఆర్ ఒక్క‌సారిగా ఏదో జ‌రిగిన‌ట్లు ఝ‌ల‌క్ ఇచ్చారు. రామ్ చరణ్ గిచ్చాడనే ఎక్స్ ప్రెషన్ ఇస్తూ వెంటనే దూరం జరిగాడు. అదేంటి.. అలా పక్కకు జరిగావని చరణ్ అనడంతో.. మళ్లీ నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సీన్ అక్క‌డ ఉన్న వారంద‌రినీ మ‌రోసారి నవ్వుల్లో ముంచెత్తింది.

Next Story